"తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకు చావండి" అన్నట్టు మన దేశంలో ఎందరో ఎన్నో ఉద్యమంలో రాజకీయ నేతలు గాని ఉద్యమాకారులు గాని సభలు పెట్టి కళాశాలలో చదువుతున్న విద్యార్థులని ఉద్యమంలోకి వచ్చేలా చేసే వాళ్ళు..!! కానీ దాని వల్ల వచ్చే కష్టాలు ఏంటి, సంఘంలో వచ్చే మార్పులు ఏంటి..? వ్యక్తిగతంగా ఒక కాలేజి కుర్రవాడు పరిస్థితి, వాడి భవిష్యత్తు ఏంటి అని ఎవ్వరూ ఆలోచించరు..!!
కానీ అటువంటి ఒక సాధారణ కాలేజి కుర్రవాడు , దేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా గాంధీ గారు మొదలు పెట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం లో చేరి, ఒక సత్యాగ్రహి అవ్వడం వల్ల జరిగిన మార్పులు ఏంటి..? తన ఊరికి, తన కుటుంబం లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే మహిధర రామమోహనరావు రాసిన "కొల్లాయి గట్టితేనేమి" చదవాల్సిందే..!!
ఈ కథ 1920-22 మధ్య రాజోలు దెగ్గర ఉన్న ముంగండ అనే గ్రామంలో ఉంటున్న రామనాథం అనే యువకుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది..!!
గాంధీగారి మాటలకి ప్రభావిత అయ్యి తన రాజమండ్రి లో ఉంటున్న తన కాలేజి చదువుకు స్వస్తి చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహం తీసుకుని , తన ఊరికి వెళ్ళడానికి సిద్ధపడటంతో కథ మొదలు అవుతుంది.. గాంధీ గారు తన ఊరికి రావడంతో ముగుస్తుంది..!!
ఎంత చిన్నగా మొదలు అవుతుందో అంతే చిన్నగా,సాధారణంగానే ముగుస్తుంది కూడా..!!
కానీ ఇక్కడ కథ కన్నా కథ చుట్టూ అల్లుకుంటున్న పరిస్థితులు, వాటి వల్ల రామనాథం లో అంతర్గత ఆలోచనలు, వాటి వల్ల తన ఊర్లో జరిగిన మార్పులు అవి ముఖ్యంగా మనం చదవచ్చు..!!
గోదావరి జిల్లాలో ఉండే బ్రాహ్మణ కుటుంబంలో ఉండే ఆ సంప్రదాయ పట్టింపులు, వాళ్ళ చదస్తపు ఆలోచనలు, వీరేశలింగం పంతులు, బ్రహ్మ సమాజం, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి సంఘ సంస్కర్తల చర్యలు, వర్ణ వ్యవస్థని సమర్ధించే వాళ్లు, బ్రిటిష్ వాళ్ళు ఉండటమే మంచిది అనుకునే వాళ్ళు, మహాత్మా గాంధీ గురించి రకరకాలుగా మాట్లాడే వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు..!!
ఇది 1920-22 మధ్య కాలం కాబట్టి అప్పటికి మన తెలుగు రాష్ట్రంలో రష్యన్ కమ్యూనిస్టు భావజాలం పెద్దగా లేకపోవడం వల్ల పెద్దగా ఆదర్శాల బేధాలు( Ideoloical Conflicts) గురించి లేదు..!!
ఈ పుస్తకంలో మొత్తం 3 భాగాలు ఉన్నాయి.
మొదటిది గాంధీ గారి సత్యాగ్రహం తీసుకోవడం వల్ల తన ఊర్లో, తన కుటుంబంలో జరిగిన మార్పుల గురించి, రెండవది గాంధీగారు చెప్పిన అస్పృశ్యత, అంటరానితనం నిర్ములనకి జరిగిన ప్రయత్నాలు, మూడవది గాంధీగారు తన ఊరికి రావడం వల్ల జరిగిన మార్పులు గురించి ఉంటుంది..!!
నవలలో అంతర్గతంగా సమాజంలో వచ్చినా ఆలోచన మార్పుని , అది కూడా ముఖ్యంగా గాంధీ లాగా ఖాదీ కట్టుకుని జీవించడం వల్ల వచ్చే కష్టాలని మనం చదవచ్చు..!!